పాడి కౌశిక్​రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు.. ప్లైయాష్​ కాంట్రాక్టర్ల సంఘం వెల్లడి

పాడి కౌశిక్​రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు.. ప్లైయాష్​ కాంట్రాక్టర్ల సంఘం వెల్లడి

  ఖైరతాబాద్, వెలుగు:  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​పై హుజూరాబాద్​ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్లైయాష్​ కాంట్రాక్టర్ల సంఘం వెల్లడించింది.  ప్లైయాష్​ రవాణా ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందని ఆయన చేసిన ఆరోపణలు అవగాహన లేమితో చేసినవేనని తెలిపింది. శనివారం ప్రెస్​క్లబ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నేత సమద్​నవాబ్​మాట్లాడారు. 

తనకు కమీషన్ ఇవ్వలేదనే కోపంతోనే పొన్నం ప్రభాకర్​పై కౌశిక్​ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కమీషన్ ఇవ్వనందుకే ప్లైయాష్​ రవాణా చేస్తున్నవారిపై కక్ష పూరితంగా తప్పుడు కేసులు పెడుతున్నట్టు వివరించారు. ఎన్టీపీసీలో సింగరేణి  నుంచి వచ్చిన బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి జరుగుతుందని, అనంతరం బూడిదగా మారిన బొగ్గు వేల ఎకరాల్లో పేరుకు పోతుందని చెప్పారు. 

 పేరుకు పోయిన ప్లైయాష్​ ను తరలించేందుకు ఎన్టీపీసీ టెండర్లను ఆహ్వానిస్తుందన్నారు. గ్రావెల్​ అందుబాటులో  లేని ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లకు ఉచితంగా ఈ బూడిదను అందిస్తున్నట్టు చెప్పారు. ప్లైయాష్​ రవాణాపై ఆధార పడి మూడు వందల మంది జీవిస్తున్నారని తెలిపారు. ప్లైయాష్​ కాంట్రాక్ట్​ మొత్తం 150 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 30 కోట్ల పనులే జరిగినట్లు వెల్లడించారు. అలాంటప్పుడు 100కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమని  సమద్​నవాబ్​ ప్రశ్నించారు. సమావేశంలో రవీందర్, మల్లేశం, రాజేశ్, ఫరీద్, శ్రీపాల్​తదితరులు పాల్గొన్నారు.