మైఖేల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన రోబో.. ఊహించని షాక్.. చివరికి ఏమైందంటే?

మైఖేల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన రోబో.. ఊహించని షాక్.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో  మనిషిలాంటి ఓ రోబోట్ స్టేజ్ పై నడుచుకుంటూ వచ్చి, 1983 నాటి మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ పాట బిల్లీ జీన్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. మొదట్లో ఈ రోబోట్ దాని కాళ్లతో చేసిన డ్యాన్స్  విన్యాసాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా...కానీ, స్టేజ్ పైన ఉన్న ఒక  మెట్టును అది గమనించకుండా ముందుకు అడుగు వేయడంతో  అసలు సమస్య మొదలైంది. దాంతో బ్యాలెన్స్ తప్పి, వింత వింతగా కదులుతూ తడబడుతుంది......

అయినా సరే, ఆ రోబోట్ మళ్లీ ఎలాగోలా నిలదొక్కుకొని మైఖేల్ జాక్సన్ ఫేమస్ స్టెప్  మూన్‌వాక్ చేస్తూ కాస్త మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ కాసేపటికే మళ్లీ అదే మెట్టు దగ్గర అడుగు వేసి దారుణంగా పడిపోయిందంటే... ఇక అసలు కదల్లేకపోయింది. చివరికి ఒక టెక్నీషియన్ స్టేజ్ మీదికి వచ్చి, ప్రాణం లేని బొమ్మలా పడి ఉన్న ఆ రోబోను పక్కకు లాక్కెళ్లాల్సి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే 
చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఉన్న "ఫ్యూచర్ ఎరా" అనే రోబోట్ స్టోర్ లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ వీడియో తీశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి రాగానే, జనాలు దీనిపై రకరకాల జోకులు వేస్తూ, కామెంట్స్  చేస్తూ, మరికొందరైతే జాలిపడుతూ కామెంట్లు పెట్టారు.

నిజానికి, ఈ వీడియో ఇప్పుడు మనం ఇంటర్నెట్‌లో చూసే రోబోల షోల వెనుక ఉన్న అసలు సమస్యను బయటపెట్టింది. కొన్ని నెలల క్రితం కూడా రోబోలు బ్యాకప్ డ్యాన్సర్లుగా స్టేజ్ రఫ్ఫాడించిన వీడియోలు మనం చూశాం.

ఇలాంటి క్లిప్‌లు చూసినప్పుడు "అబ్బా! రోబోలు ఎంత వేగంగా డెవలప్ అయిపోయాయో" అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే... ఇవన్నీ ముందుగానే కంప్యూటర్ లో సెట్ చేసిన స్టెప్పులు మాత్రమే. అసలు విషయం ఏంటంటే ఈ డెమోలో అంతా అనుకున్నట్లు సాగినంత సేపు రోబోలు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ, ఈ వైరల్ వీడియోలో జరిగినట్లుగా ఊహించనిది ఏదైనా ఎదురైతే మాత్రం అవి పూర్తిగా ఫెయిల్ అవుతాయి.

ALSO READ : ఎలక్ట్రిక్ కారు, బైక్ కొనే ఉద్యోగులకు క్యాష్ సబ్సిడీ..

రోబోలు మన ఇళ్లలోకి 
కేవలం జనాలను ఆశ్చర్యపరచడమే లక్ష్యం అయితే ఇలాంటి డ్యాన్సులు ఓకే. కానీ, రోబోలు నిజ జీవితంలో పనులు చేయాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇల్లు తుడవడం లేదా గిన్నెలు కడగడం వంటివి మనకు చిన్న పనులుగా అనిపించవచ్చు. కానీ, వస్తువులతో నిండిపోయి ఉన్న మన ఇళ్లలో రోబోలు ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏ వస్తువు అడ్డం వస్తుందో తెలియని ఇలాంటి చోట్ల రోబోలు సులభంగా తడబడిపోతాయి.

రోబోలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ వైరల్ అయిన మరో విషయమే ఉదాహరణ. 'ఫిగర్' అనే రోబోటిక్స్ కంపెనీ,  రోబోట్ కన్వేయర్ బెల్ట్ మీద ప్యాకేజీలను వేరుచేసే పనిని లైవ్ స్ట్రీమ్ చేసి చూపించింది. అక్కడ ఉన్నవన్నీ కేవలం ప్యాకేజీలే, రోబోట్‌కు ఎలాంటి డ్యాన్స్ స్టెప్పులు వేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే, ఆ రోబోట్ చాలా మెల్లగా, ఇబ్బంది పడుతూ పని చేసింది. దానితో పోటీ పడిన ఒక సాధారణ మనిషి కంటే అది చాలా తక్కువ తేడాతో మాత్రమే గెలిచింది. కంపెనీ రోబోను గొప్పగా చూపించడం కోసమే ఆ మనిషి కావాలని ఓడిపోయాడని కూడా కొందరు అంటున్నారు.

కాబట్టి, ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే రోబోల వీడియోలను చూసి మోసపోకండి, కొంచెం అనుమానంతోనే చూడండి. రోబోలు చేసే విన్యాసాలు, డ్యాన్సులు వార్తల్లో నిలవడానికి బాగానే ఉంటాయి. కానీ, మన ఇళ్లలో ఏ వస్తువునూ పాడుచేయకుండా సులభంగా ఇంటి పనులు చేయగలిగిన రోజే... ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని నిజంగా మార్చేసిందని చెప్పగలం.