పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ పిలుపు తర్వాత హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ ‘అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ’ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించి ఈవీల వైపు మళ్లాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఈ సంస్థ వేగంగా స్పందించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల కోసం 'గ్రీన్ వర్క్‌ప్లేస్ మూవ్‌మెంట్'ను ప్రారంభిస్తూ.. ఎలక్ట్రిక్ కారు లేదా బైక్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.
సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ఈ కంపెనీ ఈవీ పాలసీ వివరాలను వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా ఈవీ వాహనాలను కొనుక్కునే తమ టెక్కీలకు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నట్లు చెప్పారు. దీని కింద ఈవీ కారు కొనుక్కుంటే రూ.10వేలు, ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే రూ.5వేలు సబ్సిడీ రూపంలో కంపెనీ డబ్బు అందిస్తుందని అన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా కాలుష్యాన్ని, ఖర్చును తగ్గించే కార్పూలింగ్ విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే మే 10న హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా కాలంలో విజయవంతంగా అమలు చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వంటి పద్ధతులను దేశ ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ స్టార్ట్ చేయాలని సూచించారు. కాలం తెచ్చిన ఈ సవాలును ఎదుర్కొని, దేశ ప్రయోజనాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు.
ALSO READ : ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయెుచ్చు..
ప్రధాని పిలుపుతో దేశంలోని బ్యాంకింగ్ రంగాలు కూడా వీలున్న ఉద్యోగులకు రిమోట్ వర్క్ విధానాలను అమలు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన కార్పొరేట్ అండ్ బిజినెస్ ఎనేబ్లింగ్ విభాగాల ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ సైతం కస్టమర్లతో నేరుగా సంబంధం లేని ఉద్యోగులకు హైబ్రిడ్ పని విధానాన్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు ఆర్థిక సంస్థలు ఖర్చులను తగ్గిస్తూ.. డిజిటల్ మీటింగుల వైపు అడుగులు వేస్తున్నాయి.
