ఒక గంటకు ఎంత మంది చనిపోయితున్నారో తెలుసా.. మన ఇండియాలోనే నిమిషానికి ఎంత మంది అంటే..

ఒక గంటకు ఎంత మంది చనిపోయితున్నారో తెలుసా.. మన ఇండియాలోనే నిమిషానికి ఎంత మంది అంటే..

మనం రోజూ మన పనుల్లో మునిగిపోయి, ఫోన్లు స్క్రోల్ చేస్తూ, ప్రశాంతంగా నిద్రపోతున్న... ప్రతి గంటకూ ప్రపంచంలో ఒక ఘోరమైన నిశ్శబ్ద వాస్తవం జరుగుతోంది. అదేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవి ఏదో యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్న మరణాలు కావు. నిత్య జీవితంలో సహజంగా జరుగుతున్నవే. ఈ లెక్కలు గమనిస్తే మన ఆరోగ్య వ్యవస్థలు, జీవన విధానంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

ఇవి కేవలం లెక్కలు  మాత్రమే కాదు. ప్రతి అంకెల వెనుక అర్ధాంతరంగా ముగిసిపోయిన ఒక జీవితం, రోదిస్తున్న ఒక కుటుంబం ఉన్నాయి. ఇంతకీ ప్రతి గంటకు ఏ దేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారు ? ఎందుకు చనిపోతున్నారు ? ఇందులో మన భారతదేశం స్థానం ఏంటి ? అనే విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి.

800 కోట్ల పైగా ప్రపంచ జనాభా  
ప్రస్తుతం ప్రపంచ జనాభా  800 కోట్లు దాటిపోయింది. ఇందులో  146 కోట్లు కంటే ఎక్కువ జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా 141 కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, అమెరికా  34 కోట్లకు పైగా జనాభాతో మూడో స్థానంలో ఉన్నాయి. అయితే, ఈ రిపోర్ట్ ముఖ్య ఉద్దేశ్యం కేవలం ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉందో చెప్పడం కాదు. ఏ దేశం  గంటకు అత్యధికంగా ప్రజలను కోల్పోతుందో తెలుసుకోవడమే.

ప్రపంచవ్యాప్త మరణాల గణాంకాలు 
ఈ మధ్య  విడుదలైన 'గ్లోబల్ ఇండెక్స్' రిపోర్ట్ ప్రకారం, మరణాల సంఖ్య చాలా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా చైనా, భారతదేశం వంటి దేశాలలో ప్రతి ఒక్క గంటకు 1,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి ఆ దేశాల భారీ జనాభాతో పాటు, అక్కడ ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా కారణం.

గంటకు అత్యధిక మరణాల రేటు ఉన్న టాప్ 3 దేశాలు
1. మొదటి స్థానంలో చైనా 
ప్రతి గంటకు దాదాపు 1,221 మరణాలతో చైనా ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. చైనాలో జనాభా ఎక్కువగా ఉండటం, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, అక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలు.

►ALSO READ | కాబూల్ లో రోడ్డు ప్రమాదం..అదుపుతప్పి లారీ బోల్తా..అఫ్గాన్ శరణార్థులు 18 మంది మృతి

2. రెండో స్థానంలో  భారతదేశం 
ప్రతి గంటకు సుమారు 1,069 మరణాలతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో జనాభా పెరుగుదల ఒక కారణం అయితే, సరైన జీవన ప్రమాణాలు లేకపోవడం, మారుతున్న జీవనశైలి వ్యాధులు ఇంకా అందరికీ సరైన వైద్య సదుపాయాలు అందకపోవడం వంటి సమస్యలను ఈ సంఖ్య సూచిస్తోంది. అంటే ఒక నిమిషానికి సుమారు 18 పైగానే చనిపోతున్నారు.  

3. మూడో స్థానంలో  అమెరికా
ప్రతి గంటకు సుమారు 332 మరణాలతో అమెరికా మూడో స్థానంలో ఉంది. చైనా, ఇండియాతో పోలిస్తే అమెరికా జనాభా చాలా తక్కువే అయిన.. అక్కడ వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం ఇంకా దీర్ఘకాలిక రోగాల వల్ల మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

*తరువాత 4వ స్థానంలో ప్రతి గంటకు సుమారు 313 మరణాలతో నైజీరియా, 

*5వ స్థానంలో గంటకు సుమారు 238 మరణాలతో  ఇండోనేషియా, 

* 6వ స్థానంలో గంటకు 198 మరణాలతో రష్యా, 

*7వ స్థానంలో గంటకు 181 మరణాలతో  పాకిస్తాన్, 

*8వ స్థానంలో గంటకు  180 మరణాలతో జపాన్, 

*9వ స్థానంలో  గంటకు సుమారు 167 మరణాలతో బ్రెజిల్, 

*10వ  స్థానంలో 108 మరణాలతో జర్మనీ ఉంది.     

 మనం తెలుసుకోవాల్సిన అసలు నిజం
ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎక్కువ మరణాలు సంభవించడానికి కేవలం జనాభా ఒక్కటే కారణం కాదు. దేశాల ఆర్థిక పరిస్థితులు, వైద్య రంగంలో ఉన్న లోపాలు, నివారించగల వ్యాధుల పట్ల నిర్లక్ష్యం కూడా దీనికి కారణాలు.

ప్రతి గంటకూ ఏ వార్తల్లోనూ రాకుండా, ఎటువంటి హ్యాష్‌ట్యాగ్‌లు లేకుండా నిశ్శబ్దంగా వేల మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ మరణాల సంఖ్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, ఏ దేశం మొదటి స్థానంలో ఉందనేది కాదు ముఖ్యం.. ఇలాంటి మరణాలను తగ్గించడానికి, ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలు అందించడానికి ప్రపంచ దేశాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయనేదే అసలైన ప్రశ్న.