- ట్రంప్ యంత్రాంగం ఆందోళనతో కాలిఫోర్నియా సమీక్ష
వాషింగ్టన్: విదేశీయులకు వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులకు ఇచ్చిన17,000 డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేయాలని కాలిఫోర్నియా ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ లైసెన్స్ ల గడువు తీరిపోయిందని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇటీవల ఫ్లోరిడాలో ఒక ఇండియన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాలు వలసదారులకు చట్టవిరుద్ధంగా లైసెన్స్ లు మంజూరు చేశాయని ట్రంప్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది.
సెమీ ట్రక్, బస్ ను నడిపేందుకు అక్రమంగా లైసెన్స్ లు పొందారని ఆరోపించింది. దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వం డ్రైవర్ల లైసెన్స్ లపై ఆడిట్ ప్రారంభించింది. టెక్సాస్, అలబామాలో కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇదేతరహా ప్రమాదాలు జరిగాయి. ఇవన్నీ లైసెన్స్ ల విషయంలో పలు ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే లైసెన్సులను రద్దు చేయాలని కాలిఫోర్నియా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
