- ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి
- ఇరిగేషన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష
- ముంపు భూములకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం
- మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రానిదే
- మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం
- రూ. 11 వేల కోట్ల ప్రజాధనం వృథా కానివ్వం
- గత పనుల సద్వినియోగమే లక్ష్యం
- ఆదిలాబాద్ సహా మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు
- వర్షాలు వచ్చే లోగా మేడిగడ్డ వద్ద
- పరీక్షలు పూర్తిచేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి, 100 టీఎంసీలను గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మహారాష్ట్ర ను ఒప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం తీసుకోవాలని సూచించారు.
బుధవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇరిగేషన్ నిపుణులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలోఈమేరకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం గతంలోనే సుమారు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముందుగా సీఎంకు వివరించారు. ఈ నిర్మాణాలన్నీ వృథా కాకుండా ఉండాలంటే 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించడం మేలని నిపుణులు సూచించారు.
గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, కానీ 152 మీటర్ల ఎత్తు పెంచితే ముంపు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా150 మీటర్ల ఎత్తుకు ఒప్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించే వీలుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
- కిషన్‌రెడ్డి ద్వారా మహారాష్ట్రను ఒప్పిద్దాం..
కాళేశ్వరం రిజర్వాయర్లపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణమే మేలని, ఇది పూర్తయితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించవచ్చని సీఎం రేవంత్ చెప్పారు. 150 మీటర్ల ఎత్తు వల్ల మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఒకవేళ ఎక్కడైనా ముంపు వాటిల్లితే బాధితులకు పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకుని స్వయంగా కలిసి చర్చించాలని ఉత్తమ్ కు బాధ్యతలు అప్పగించారు.
ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, తెలంగాణ రైతుల పక్షాన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. అక్కడ జరుగుతున్న జియో టెస్టింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం మొదలై వరదలు వచ్చేలోపే పనులు పూర్తి కావాలని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి-–ఎల్లంపల్లి లింక్‌కు నాలుగు ప్రతిపాదనలు
- అనుకూలమైన, ఖర్చు తక్కువయ్యే అలైన్‌మెంట్‌పై విశ్లేషణ: మంత్రి ఉత్తమ్
- సీఎం రేవంత్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు 4 ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్సంయుక్తంగా అక్కడ సర్వే చేశాయని, 4 ప్రతిపాదనలతో సిఫార్సులు ఇచ్చాయని పేర్కొన్నారు. ఆ నాలుగు ప్రతిపాదనల్లో ఏది అనుకూలంగా ఉంటుంది? దేనికి ఖర్చు తక్కువ అవుతుంది? ఏది సమర్థమైన ప్రతిపాదన? అనే అంశాలను విశ్లేషిస్తున్నట్టు చెప్పారు.
బుధవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి– ఎల్లంపల్లి లింక్‌పై అధికారులు వివరించారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డిటెయిల్డ్ ప్రతిపాదనలను తయారు చేశామని తెలిపారు.
- అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నం
తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించిన అనంతరం దేనికి ఆమోదం తెలపాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని తెలిపారు. వర్షాకాలం వచ్చేలోపు అవసరమైన అన్ని టెస్టులు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి ఒకటిన్నర మీటర్లకూ స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్టులు చేయాలన్నారు.
ప్రతి 3 మీటర్లకు పర్మియేబిలిటీ టెస్టులు నిర్వహించాలని సూచించారు. బోర్లు తవ్వే క్రమంలో రాయి అడ్డొస్తే.. కనీసం 5 మీటర్ల లోతైనా తవ్వాలన్నారు. కో ఆర్డినేషన్ కమిటీలోని అధికారులు వెంటనే బ్యారేజీ సైట్లను పరిశీలించాలని ఆదేశించారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తయ్యేలా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అధికారులు కూడా ఫీల్డ్‌లో ఉండాలని సూచించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక పంపించాలని ఉత్తమ్ ఆదేశించారు.

