- ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తం:కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు సంబంధించి8వ వేతన సవరణ సంఘం విధి విధానాలను కేంద్ర కేబినెట్ ఆమోదించడం సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటు మెరుగవుతుందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ‘సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదంతో దేశంలో అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న కృషికి సరైన గుర్తింపును కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచే దిశగా తమ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుందన్నారు. నిరంతరం ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.
