40 ఏళ్ల కృషికి భారీ సత్కారం: భారతీయ ఉద్యోగికి మెక్‌డొనాల్డ్స్ ఓనర్ 35 లక్షల చెక్!

40 ఏళ్ల కృషికి భారీ సత్కారం: భారతీయ ఉద్యోగికి మెక్‌డొనాల్డ్స్ ఓనర్ 35 లక్షల చెక్!

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో 40 ఏళ్లుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్ అరుదైన గౌరవం అందుకున్నారు. ఆయన అంకితభావానికి మెచ్చిన మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్ ఆయనకు $40 వేల డాలర్లు అంటే  సుమారు రూ. 35 లక్షల చెక్కును ఇచ్చి సత్కరించారు.

ఈ ప్రత్యేక వేడుకకి బల్బీర్ సింగ్‌ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు. తరువాత ఆయనకు సేవా పురస్కారం & "వన్ ఇన్ ఎయిట్" అనే గుర్తుతో ఉన్న స్మారక జాకెట్ కూడా అందించారు. లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ మా సంస్థకు  గుండెలాంటి వారని పొగిడారు.
 
బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్‌డొనాల్డ్స్‌లో కెరీర్‌  ప్రారంభించారు. ఆయన మొదటగా 1985లో సోమర్‌విల్లేలోని రెస్టారెంట్లో వంటగదిలో సిబ్బందిగా (Kitchen Staff) పని చేయడం మొదలుపెట్టారు. 

బల్బీర్ సింగ్  మాట్లాడుతూ నేను మొదట సిబ్బందిగా ఉద్యోగం  ప్రారంభించాను. వంటగదిలో పనిచేశాను, బ్యాక్ ఎండ్  విభాగంలో సహాయం చేసాను... నేను ప్రతిదీ అంటే అన్ని పనులు  చేయడానికి ప్రయత్నించాను అని గుర్తు చేసుకున్నారు. బల్బీర్ సింగ్  కష్టపడి పనిచేసి, మెల్లగా పైకి ఎదుగుతూ ఇప్పుడు వాలిన్ సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు.

లిండ్సే  వాలిన్ ప్రకారం, బల్బీర్ సింగ్ ఎప్పుడూ మా కంపెనీ నినాదమైన "ఎందుకు కాదు?" అనే వైఖరిని పాటిస్తారు. ఎందుకు కొత్తగా ప్రయత్నించకూడదు ? ఎందుకు ఎదగకూడదు ? ఎందుకు మంచి కోసం ప్రయత్నించకూడదు ? అనే ఈ ఆలోచనా విధానమే మా  విజయానికి కారణమని లిండ్సే వాలిన్ తెలిపారు.