- వృద్ధాప్య సమస్యలతో అమెరికాలో మృతి
- జర్నలిస్టుగా 70 ఏండ్ల సుదీర్ఘ కెరీర్
- దక్కన్ క్రానికల్, డైలీ న్యూస్, ఇండియన్ ఎక్స్ ప్రెస్,
- టైమ్స్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో సర్వీస్
న్యూఢిల్లీ: వెటరన్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి (99) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అమెరికాలోని న్యూజెర్సీలో ఓ హాస్పిటల్ లోచికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటలకు ఆయన చనిపోయారని దాసు తమ్ముడు, ద హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ దాసు కేశవరావు తెలిపారు. కృష్ణమూర్తి జర్నలిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 1954–55లో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ఫస్ట్ బ్యాచ్ కు చెందిన వారు. ఇంటర్నీగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. తర్వాత ద సెంటినెల్ లో తన కెరీర్ ను ప్రారంభించారు.
దక్కన్ క్రానికల్, డైలీ న్యూస్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1959లో విజయవాడలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ బ్రాంచ్ ను స్థాపించడంలో కృషి చేశారు. అహ్మదాబాద్ లోని టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాక 1969లో ఢిల్లీకి మారారు. అక్కడ పేట్రియట్ దినపత్రికలో దాదాపు 20 ఏండ్లు పనిచేశారు. ఆ సమయంలో వైవిధ్యమైన పేజీ లేఔట్ తో డెస్క్ మ్యాన్ గా పేరు పొందారు.
రిటైర్ అయ్యాక ఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఓయూ, ఆంధ్రా ఓపెన్ వర్సిటీ, భవన్స్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో బోధించారు. 2001లో అమెరికాకు వలస వెళ్లాక రచనలు చేయడం ప్రారంభించారు. 2024లో ఉస్మానియా వర్సిటీ కృష్ణమూర్తిని లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది.
