ఉత్తరాదిన విధ్వంసం సృష్టిస్తోన్న భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన కార్లు

ఉత్తరాదిన విధ్వంసం సృష్టిస్తోన్న భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన కార్లు

దేశంలోని ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. అందులో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లుపైకి, ఇళ్లలోకి వచ్చి నానా విధ్యంసం చేశాయి. తాజాగా రాష్ట్రంలోని సోలన్ జిల్లాలోని పర్వానూ అనే పర్యాటక ప్రదేశంలో రికార్డయిన కొన్ని దృశ్యాలు వర్షాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. వరద ప్రవాహానికి కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోతుండడం, వాటిని చూసి బాల్కనీలో నుంచి చూస్తున్న కొందరు వ్యక్తులు కేకలు వేస్తూ.. ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.  

ఇప్పటికే భారీ వర్షం రహదారులన్నింటినీ జలమార్గాలుగా మార్చగా.. వంతెనలు సైతం కొట్టుకుపోతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ విధ్వంసర పరిస్థితిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు.. ప్రజలను ఇళ్లలోనే ఉండమని విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల చండీగఢ్-మనాలి జాతీయ రహదారి మూసుకుపోయింది. సిమ్లా-కిన్నౌర్ రహదారిపైనా రాళ్లు పడిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆకస్మిక వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతుండగా.. ఈ నష్టం రూ.3 నుంచి 4 కోట్ల పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు .

రవాణా శాఖ అధికారుల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు మూసుకుపోయాయి. ఈ క్రమంలో హిమాచల్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ).. 12వందల 55 రూట్లలో బస్సు సర్వీసులు నిలిపివేసింది. 576 బస్సులు పలు మార్గాల్లో వివిధ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.