కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. శనివారం కలెక్టరేట్ లో శిశు సంక్షేమం, ఇంజినీరింగ్, డీఆర్డీవో, క్రీడల, సంక్షేమ శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గీజర్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళ, శిశు సంక్షేమ, యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలలపాటు కబడ్డీ ఖోఖో, వాలీబాల్ క్రీడలను 20 పాఠశాలల్లో నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు డిసెంబర్ 15 నాటికి అందుబాటులోకి తీసుకోరావాలని అధికారులకు సూచించారు.
వసతులు కల్పించాలి
పర్వతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన వసతులు కల్పించాలని కలెక్టర్సత్యశారద ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ఆమె పర్వతగిరి మండలం మాల్యా తండా, ఏనుగల్లు, చౌటపెల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వసతులపై ఆరా తీస్తూ ధాన్యం తేమ శాతాన్ని చూశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
భారీ వర్షాలకు నష్టపోయిన పంట వివరాలు నమోదు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొంకపాక ధాన్యం గోడౌన్ను పరిశీలించి, నిల్వ ఉంచిన ధాన్యం నాణ్యతపై ఆరా తీశారు.
