- నిజ నిర్ధారణ లేకుండా వార్తలు రాయొద్దు
- వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గాంజా బ్యాచ్‌లు, గ్యాంగ్ రేప్‌లు వంటి వార్తలన్నీ మీడియా సృష్టించినవేనని, ఇలాంటి వార్తల్లో నిజం లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా, మహిళల విషయంలో ఏదైనా ఘటన జరిగినా మీడియా దాన్ని సెన్సేషన్ కోసం అతిశయోక్తిగా చూపిస్తోందన్నారు. ఏదైనా నేర ఘటనకు సంబంధించిన విషయాలు మీడియాకు ముందుగా లభిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
అలా చేయకుండా పోలీసుల విచారణ, వైద్యుల నివేదికలు రాకముందే గ్యాంగ్ రేప్ అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు, వైద్యుల దర్యాప్తులో గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని తేలిందన్నారు. అయినప్పటికీ మీడియా ‘గ్యాంగ్ రేప్, గాంజా బ్యాచ్ మర్డర్’ అంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేసిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్పీడ్‌గా వ్యాపిస్తున్నాయన్నారు. సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనిసూచించారు.

