సీఏపీఎఫ్ జవాన్లకు న్యాయం చేస్తాం..వివక్షపూరిత చట్టాన్ని రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ

సీఏపీఎఫ్ జవాన్లకు న్యాయం చేస్తాం..వివక్షపూరిత చట్టాన్ని రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) లో కొనసాగుతున్న వివక్షాపూరిత వ్యవస్థను తమ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. సీఏపీఎఫ్ సిబ్బందికి నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలను నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. వారికి దక్కాల్సిన హక్కులు, గౌరవాన్ని కచ్చితంగా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

ఈ మేరకు గురువారం సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ ‘శౌర్య దినోత్సవం’ సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘జవాన్ల త్యాగాలను కేవలం మాటలతో గౌరవిస్తే సరిపోదు. దశాబ్దాల కఠిన శ్రమ, అంకితభావం ఉన్నప్పటికీ సీఏపీఎఫ్ అధికారులకు సకాలంలో పదోన్నతులు రావడం లేదు. ఈ దళాలకు నాయకత్వం వహించే అత్యున్నత పదవులను బయటి వ్యక్తులకు (ఐపీఎస్ అధికారులు) కేటాయించడం వల్ల, సంస్థలోని వారికి నాయకత్వం వహించే అవకాశాలు దక్కడం లేదు’’ అని విమర్శించారు. 

వివక్షను చట్టబద్ధం చేయాలని చూస్తున్నరు..   

సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో పనిచేసే వారికి క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాత్మక అవగాహన ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఆయా దళాల నుంచే నాయకులు ఎదగడం దేశ భద్రతకు ఎంతో అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పదోన్నతులు, జీతభత్యాలు, సంక్షేమం, గౌరవం విషయంలో జరుగుతున్న ఈ అన్యాయం దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన సీఏపీఎఫ్ ఏకీకృత చట్టంపై కూడా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా జవాన్లపై జరుగుతున్న వివక్షను చట్టబద్ధం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ వివక్షాపూరిత చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.