రోడ్డు లేదా హైవేల పక్కన, తోటల్లో చెట్ల మొదళ్లకు తెల్ల రంగు వేయడం మనం చూస్తుంటాం. కొందరు దీనిని కేవలం అందం కోసం అనుకుంటారు, కానీ దీని వెనుక చాలా ముఖ్యమైన శాస్త్రీయ కారణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పద్ధతి ఈనాటిది కాదు, ప్రాచీన గ్రీకుల కాలం నుండి వస్తోంది. చెట్ల మొదళ్లకు సున్నం లేదా తెల్ల రంగు ఎందుకు వేస్తారో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా....
1. ఎండదెబ్బ తగలకుండా
మనుషుల లాగే చిన్న మొక్కలు, లేత చెట్లు కూడా ఎండ తీవ్రతకు దెబ్బతింటాయి. పెద్ద చెట్లతో పోలిస్తే చిన్న మొక్కల బెరడు చాలా పలుచగా ఉంటుంది. అలాగే వాటికి కొమ్మలు, ఆకులు తక్కువగా ఉండటం వల్ల కాండంపై ఎండ నేరుగా పడుతుంది. చెట్టు మొదళ్లకు తెల్ల రంగు వేయడం వల్ల అది సూర్యరశ్మిని రిఫ్లెట్ చేస్తుంది. అంటే వేడిని వెనక్కి నెట్టేస్తుంది. దీనివల్ల కాండంపై ఎక్కువ వేడి పడకుండా ఎండదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది.
2. బలహీనమైన చెట్లను కాపాడటానికి
ఎక్కువ వేడి ఉండే ప్రాంతాలలో చెట్లు ఏడాది పొడవునా ఎండ తీవ్రతను తట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొమ్మలు నరికేసిన చెట్లు లేదా గాలి వానకు కొమ్మలు విరిగిపోయిన వృద్ధ చెట్లు చాలా బలహీనంగా మారతాయి. కొమ్మలు విరిగిన చోట ఏర్పడే మచ్చలు ఎండ వేడికి త్వరగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అటువంటి భాగాలకు తెల్ల రంగు పూయడం వల్ల అవి ఎండాకాలాన్ని తట్టుకుని నిలబడతాయి. బెరడు పగిలిపోకుండా ఉంటుంది.
3. వాతావరణ మార్పుల నుండి రక్షణ
పండ్ల తోటలు, ముఖ్యంగా నిమ్మ, నారింజ వంటి పండ్ల చెట్లకు పలుచని బెరడు ఉంటుంది. శీతాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇవి ఎక్కువగా దెబ్బతింటాయి. పగటిపూట ఎండ వేడికి చెట్టు లోపలి కణాలు కరుగుతాయి, రాత్రి కాగానే చలికి మళ్లీ గడ్డకడతాయి. ఈ అకస్మాత్తు మార్పుల వల్ల చెట్టు కాండం నిలువుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఇలా చీలినప్పుడు వ్యాధులు, తెగుళ్లు సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి. తెల్ల రంగు వేయడం వల్ల కాండం ఉష్ణోగ్రత అదుపులో ఉండి, పగుళ్లు రాకుండా ఉంటాయి.
4. కీటకాలు, తెగుళ్ల నివారణకు
చెట్ల బెరడుకు వచ్చే పగుళ్లు, కాండం తొలిచే పురుగులు నివాసంగా ఉండటానికి ప్రధాన మార్గాలుగా మారతాయి. ఇవి చెక్కను లోపల నుండి తినేసి చెట్టును చంపేస్తాయి. కాండానికి సున్నం లేదా తెల్ల రంగు పూయడం వల్ల ఆ పగుళ్లు మూసుకుపోతాయి. అందువల్ల కీటకాలు గుడ్లు పెట్టడానికి, లోపలికి ప్రవేశించడానికి వీలుండదు. నేల నుండి 18 నుండి 24 అంగుళాల అంటే సుమారు 2 అడుగులు ఎత్తు వరకు రంగు వేయడం వల్ల నేల ద్వారా పాకే కీటకాలను ఆపవచ్చు.
5. జంతువుల నుండి రక్షణ
పొలాల్లో లేదా అడవుల పక్కన ఉండే తోటల్లో మేకలు, గొర్రెలు, జింకలు లేదా ఎలుకలు చెట్ల బెరడును కొరికి తింటుంటాయి. తెల్లటి రంగును చూడగానే జంతువులు గందరగోళానికి గురవుతాయి. పైగా ఈ సున్నం లేదా రంగు, రుచి జంతువులకు నచ్చదు. కాబట్టి అవి బెరడును కొరకకుండా దూరంగా ఉంటాయి.
చెట్లకు రంగు వేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
కొందరు నిపుణులు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్న మొక్కలకు రంగు వేయవద్దని చెప్తారు. ఒకవేళ వేయాల్సి వస్తే మరీ మందంగా కాకుండా పలచగా వేయాలి. రంగు వేయడానికి బదులుగా శీతాకాలంలో చెట్టు చుట్టూ తెల్లటి ప్లాస్టిక్ లేదా ఫైబర్ 'ట్రీ గార్డులను' అమర్చవచ్చు. అయితే వసంతకాలంలో చెట్టు ఎదుగుదల కోసం వాటిని తీసేయాలి. చిన్న చెట్లు ఆరోగ్యంగా పెరగడానికి రోజు తప్పకుండా నీరు పోయాలి. అలాగే చెట్టు మొదలు చుట్టూ నేలపై ఎండిన ఆకులు లేదా గడ్డి వేయడం వల్ల తేమ ఆరిపోకుండా ఉంటుంది.
