
ఛత్తర్‌పూర్/జబల్‌పూర్: దైవ దర్శనం చేసుకొని ఇంటికెళ్తున్న 25 ఏండ్ల మహిళ ను ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్‌లోంచి తోసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో గత బుధవారం రాత్రి జరిగిందని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్ బంద జిల్లాకు చెందిన బాధితురాలు ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్‌లోని ఛత్తపూర్ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ దర్శించుకొని, అదే రోజు రాత్రి రైలులో సొంతూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో రైలులో ఉన్న ఒక వ్యక్తి ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దూరంగా ఉండాలని మహిళ హెచ్చరించినా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అతని చేయి కొరికింది. దీంతో నిందితుడు ఆమెను ట్రైన్‌లో నుంచి తోసేశాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటోందని, ఆమె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.