ఆపరేషన్ చేసి.. కడుపులో క్లాత్ వదిలేసిన్రు!

ఆపరేషన్ చేసి.. కడుపులో క్లాత్ వదిలేసిన్రు!
  • వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వాకం
  • మెడికో లీగల్ కేసు నమోదు చేయకుండానే గాంధీలో మళ్లీ సర్జరీ!
  • పలు అనుమానాలకు తావిస్తున్న ఘటన

పద్మారావునగర్, వెలుగు: మెడికో లీగల్ కేసు నమోదు చేయకుండానే ఓ మహిళకు గాంధీ దవాఖానలో సర్జరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఓ మహిళకు ఆపరేషన్ చేయగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆమె కడుపులో క్లాత్ మిగిలిపోయింది. ఈ విషయం బయటపడటంతో మంగళవారం హడావుడిగా ఆమెను సికింద్రాబాద్​లోని గాంధీ దవాఖానకు తరలించగా, అక్కడి వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేయకుండానే మరోసారి సర్జరీ చేసి ఆ క్లాత్​ను తొలగించినట్లు సమాచారం.

ఇలాంటి ఘటనల్లో నిబంధనల ప్రకారం తప్పనిసరిగా మెడికో లీగల్ కేసు నమోదు చేయాల్సి ఉన్నా, ఆ ప్రక్రియను పక్కన పెట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వివరణ కోరేందుకు గాంధీ అధికారులను సంప్రదించగా వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. గతంలోనూ ఇలాగే పలు కేసుల్లో నిబంధనలు అతిక్రమించి చికిత్సలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.