బస్సు యాత్రలతో ఏపీ ఎన్నికల శంఖారావం : సీఎం జగన్

బస్సు యాత్రలతో ఏపీ ఎన్నికల శంఖారావం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024  మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్  ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ సిఎం జగన్ పిలుపునిచ్చారు.   అక్టోబర్ 25 నుంచి 31 వరకు రాష్ట్రంలో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు జగన్ తెలిపారు.  తన ఆలోచనలు గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు బాగా అమలయ్యేట్టుగా పర్యవేక్షించాలన్నారు.పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకుల నుంచి మంత్రుల వరకు ప్రజాప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మార్గ నిర్దేశం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు

అక్టోబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు 60రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా కలిసి యాత్ర చేపడతారన్నారు. ఎమ్మెల్యే అధ్యక్షతన మూడు ప్రాంతాల్లో ప్రతి రోజు మూడు మీటింగ్‌లు జరుగుతాయన్నారు.

ఒక్కో రోజు అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించి ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన విద్యా, వైద్యం, అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు జరుగుతాయని చెప్పారు.
పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ ప్రసంగాలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే, అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారని, 60రోజులు నిరంతరం జరుగుతాయని, వాటిలో అంతా పాల్గొనాలని సూచించారు. 

సామాజిక న్యాయ యాత్రగా బస్సు యాత్ర జరుగుతుందన్నారు.  పేదల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వివరించాలన్నారు.ఏపీలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదని, పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో పేదలు మొత్తం ఏకం కావాలన్నారు.

ఆడుదాం ఆంధ్రాతో క్రీడాపోటీలు

బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జనవరి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.