దేశంలో జనానికి షాకులపై షాకులు. పవర్ పెట్రోల్ పై రెండు రూపాయల పెంపు వార్త అలా బయటకు వచ్చిందో లేదో.. ఆ వెంటనే టాప్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కింద ఉండే ప్లాట్ ఫాం ఛార్జీలను పెంచేసింది. ఒక్కో ఫుడ్ డెలివరీపై ప్లాట్ ఫాం ఛార్జీని రెండు రూపాయల 40 పైసలు పెంచింది. ఇప్పటి వరకు 12 రూపాయల 50 పైసలు వసూలు చేస్తుండగా.. ఇక నుంచి 14 రూపాయల 90 పైసలు వసూలు చేయనుంది జొమాటో. GSTతో కలుపుకుని ఇది 10 పైసలు తక్కువ 15 రూపాయలుగా ఉండనుంది. గత ఏడాది సెప్టెంబర్ 2025లో ప్లాట్ ఫాం ఫీజు పెంచిన తర్వాత, మళ్లీ ఇప్పుడు పెంచడం గమనార్హం.
జొమాటోకు గట్టి పోటీ ఇచ్చే స్విగ్గీ (Swiggy) కూడా ప్రస్తుతం ట్యాక్స్‌లతో కలిపి ఒక్కో ఆర్డర్‌కు రూ.14.99 వసూలు చేస్తోంది. సాధారణంగా ఈ రెండు కంపెనీలు ఒకే రకమైన ధరలను మెయింటెన్ చేస్తుంటాయి.
కొత్తగా వచ్చిన రాపిడో షాక్:
ఒకవైపు ఈ దిగ్గజ కంపెనీలు ప్లాట్ ఫాం ఫీజులు పెంచుతుంటే, మరోవైపు రాపిడో (Rapido) కొత్తగా ఫుడ్ డెలివరీ సర్వీస్ 'ఓన్లీ' ని బెంగళూరులో మొదలుపెట్టింది. కంపెనీ కస్టమర్ల దగ్గర గానీ, రెస్టారెంట్ల దగ్గర గానీ ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయబోమని ప్రకటించింది. ఇది జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్లాట్ ఫాం ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి:
ముడి చమురు (Crude oil) ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్స్ అలాగే రెస్టారెంట్లపై పడే భారాన్ని తగ్గించడానికి, కంపెనీలు ఇలా ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచుతున్నాయి.
