"ఇండియాలో ఇదో పెద్ద స్కామ్".. 61 లక్షల హాస్పిటల్ బిల్లుకు 25 లక్షలే క్లెయిమ్.. ఇన్సూరెన్స్ కంపెనీపై విమర్శలు..

"ఇండియాలో ఇదో పెద్ద స్కామ్".. 61 లక్షల హాస్పిటల్ బిల్లుకు 25 లక్షలే క్లెయిమ్..  ఇన్సూరెన్స్ కంపెనీపై విమర్శలు..

ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ ఉదిత్ గోయెంకా ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో అతిపెద్ద స్కామ్ అని మండిపడ్డారు. ఒక కుటుంబానికి రూ.61 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేయాల్సి ఉండగా, ఇందుకు నివా బుపా ఇన్సూరెన్స్ కంపెనీ నిరాకరించడంతో ఉదిత్  గోయెంకా ఈ విధంగా అన్నారు. 

Xలో షేర్ చేసిన ఓ పోస్ట్‌ ప్రకారం రూ.2.4 కోట్ల బీమా పాలసీ ఉన్నా కూడా ఒక కుటుంబానికి రూ.61 లక్షల ఆసుపత్రి బిల్లు క్లెయిమ్ ను నివా బుపా నిరాకరించిందని గోయెంకా ఆరోపించారు. చాలా ఏళ్లుగా ప్రీమియంలు కడుతున్న కూడా అవసరమైన సమయంలో బీమా కంపెనీలు నిరాకరిస్తూ తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో మైలోయిడ్ లుకేమియాతో బాధపడుతున్న ఒక రోగికి ఇదే జరిగిందని గోయెంకా వివరించారు.

క్లెయిమ్ నిరాకరణకు కారణం ఏంటి: లింక్డ్ ఇన్ పోస్ట్ ప్రకారం ఒకతనికి రూ.1 కోటి బేస్ కవర్‌తో పాటు రూ.1.4 కోట్ల నో-క్లెయిమ్ బోనస్ ఉంది. జూలై 4న అతను అనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరాక, అతని కుటుంబం రూ.61,63,038 క్లెయిమ్ కోరింది. అయితే నివా బుపా కేవలం రూ.25 లక్షల బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) ప్యాకేజీకి మాత్రమే క్లెయిమ్ చేస్తామని చెప్పి, ఆసుపత్రి బిల్లు దానికి మించిపోవడంతో క్లెయిమ్‌ నిరాకరించిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. దింతో ఈ బీమా కంపెనీ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకే రోగి, ఒకే చికిత్స, ఒకే పాలసీ. కానీ అత్యవసర పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రూ.61 లక్షలు సర్దుబాటు చేసుకోవాలి అని ఆ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఉంది. దీనికి సంబంధించి నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఎలాంటి స్పందన చేయలేదు.

ఇలాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడేల ఉంటుందని  ప్రజలు బీమా పాలసీలు తీసుకుంటారు. కానీ అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్  కంపెనీలు క్లెయిమ్ లను  పట్టించుకోకుండా చేతులు దులిపేసుకుంటున్నాయి. ఆరోగ్య బీమా అనేది కేవలం మాటల మాయ, నిబంధనల నుండి తప్పించుకునే ఆటగా మారకూడదు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు జాలి, దయ, మానవత్వంతో  న్యాయంగా ముందు నిలబడాలి అని లింక్డ్‌ఇన్ పోస్ట్ లో స్పష్టం చేశారు.