జంతువులను మన కుటుంబ సభ్యుల్లాగే చూడాలని, వాటిపై ప్రేమ చూపాలని ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు ప్రజలను కోరారు. బెంగళూరు పోలీస్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ తన పెంపుడు కుక్క 'గోపి' గురించి, వీధి కుక్కల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
తన పెంపుడు కుక్క గోపికి తనకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని ఆమె సరదాగా చెప్పారు. నేను ఢిల్లీకి వెళ్తే జనం 'మోదీ! మోదీ!' అని అరుస్తారు, కానీ బెంగళూరులో మాత్రం అందరూ గోపి! గోపి! అంటూ పలకరిస్తారు అని ఆమె నవ్వుతూ అన్నారు. చలికాలంలో పిల్లలు గోపి కోసం శాలువాలు పంపుతారని, మైసూరు దసరాలో కూడా దానికి గౌరవం దక్కిందని ఆమె గుర్తు చేసారు.
వీధి కుక్కల కోసం:
వీధి కుక్కలను అందరూ దత్తత తీసుకోలేకపోవచ్చు, కానీ వాటికి సహాయం చేయడానికి కొన్ని సులభమైన మార్గాలను ఆమె సూచించారు.
కుక్కలకు ఆహారం కంటే మనం ఇచ్చే ప్రేమే ముఖ్యం. మనం ఒక ముక్క బ్రేడ్ వేసినా అవి మన కోసం ప్రాణాలిస్తాయి. వీధి కుక్కల ప్రేమ చూపండి కానీ రాళ్లు విసరవద్దు. వాటికి కారంగా ఉండేవి లేదా పాడైపోయిన ఆహారం పెట్టకండి. వీలైతే కొంచెం అన్నం లేదా రొట్టె ముక్కలు వాటికి పెట్టండి. చిన్నప్పటి నుంచే పిల్లలకు జంతువుల పట్ల ప్రేమ ఉండేలా పెంచాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు.
జంతువులు, పక్షులు కేవలం ప్రాణులు మాత్రమే కాదు.. అవి మన కుటుంబంలో భాగం. ఒక చిన్న పిల్లాడిని ఎలా చూసుకుంటామో, మూగజీవాలను కూడా అలాగే ఆదరించాలి అని అన్నారు.
