నీతి ఆయోగ్ మీటింగ్​కు 10 మంది సీఎంలు డుమ్మా

నీతి ఆయోగ్ మీటింగ్​కు 10 మంది సీఎంలు డుమ్మా
  • నీతి ఆయోగ్ మీటింగ్​కు 10 మంది సీఎంలు డుమ్మా
  • సౌత్ నుంచి ఏపీ సీఎం జగన్ ఒక్కరే హాజరు
  • ఆప్ సీఎంలతో హైదరాబాద్​లోనే కేసీఆర్ 
  • అనారోగ్యం కారణంగా గెహ్లాట్ దూరం
  • కేబినెట్ ప్రమాణ స్వీకారం బిజీలో సిద్ధరామయ్య
  • మమత, పినరయి, నితీశ్, పట్నాయక్ కూడా డుమ్మా


న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్ కు బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన10 మంది సీఎంలు డుమ్మా కొట్టారు. సౌత్ ఇండియా నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే మీటింగ్ కు హాజరయ్యారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే కేంద్రం నిర్వహించిన ఈ కీలక మీటింగ్ కు గైర్హాజరు అయ్యారు. ఇదే టైంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. ఇక కర్నాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మీటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. కేరళ సీఎం పినరయి విజయన్ ముందుగా ఈ మీటింగ్ పై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ సమావేశానికి రాలేదు. ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అనారోగ్య కారణాల వల్ల ఢిల్లీకి వెళ్లలేదని ఆ రాష్ట్ర సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ మీటింగ్ కు రాలేకపోయినట్లు తెలిసింది. నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లడం లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ముందుగానే ప్రకటించారు. అయితే, మమత తనకు బదులుగా చీఫ్ సెక్రటరీని పంపిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలిపినప్పటికీ, కేంద్ర సర్కార్ అందుకు అంగీకరించనట్లు సమాచారం. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో సహా మొత్తం 44 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు ఉన్నారు.   

ఇంకెంత దూరం వెళ్తరు?: రవిశంకర్ ప్రసాద్

ప్రధాని మోడీని వ్యతిరేకించేందుకు ఇంకెంత దూరం వెళతారని నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరు అయిన సీఎంలపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఈ సమావేశానికి రాలేదంటే.. తమ రాష్ట్ర ప్రజల సమస్యలను చెప్పేందుకు వారు ఇష్టపడటంలేదని అర్థమన్నారు. ‘మోడీని వ్యతిరేకించేందుకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ మీరు మీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు హాని చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.  

ఉమ్మడి విజన్​తోనే దేశాభివృద్ధి: మోడీ 

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాను నిలిపేందుకు ఉమ్మడి విజన్‌‌‌‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయాలను రాష్ట్రాలు తీసుకోవాలని సూచించారు. ఆయా నిర్ణయాలు.. రాష్ట్రాలను బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలను అందించగలిగేలా ఉండాలన్నారు. శనివారం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్‌‌‌‌ సమావేశంలో ఆరోగ్యం, స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్, మహిళా సాధికారత, ఇన్‌‌‌‌ఫ్రా డెవలప్‌‌‌‌మెంట్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాలు వృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని తెలిపారు. ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యాన్ని అందుకోవాలంటే కామన్ విజన్ రూపొందించాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు” అని నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది.