10 మంది భారతీయులను అరెస్ట్ చేసిన శ్రీలంక

10 మంది భారతీయులను అరెస్ట్ చేసిన శ్రీలంక

10 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాలర్ ను స్వాధీనం చేసుకుని.. వారిని ట్రింకోమలీ నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. పట్టుబడ్డవారిని శ్రీలంక కోస్ట్ గార్డ్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిషరీస్ -ట్రింకోమలీకి అప్పగిస్తామని ఆ దేశ నేవీ క్లారిటీ ఇచ్చింది. తమ దేశానికి చెందిన సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి.. చేపలను వేటాడం వల్ల అరెస్ట్ చేశామని శ్రీలంక నేవీ అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన ముల్లైతీవు జిల్లా అలంపిల్‌ పట్టణంలో సోమవారం (ఆగస్టు 7వ తేదీన) జరిగింది. 

తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన మత్స్యకారులను పట్టుకునేందుకు నేవీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారని శ్రీలంక అధికారిక పత్రిక తెలియజేసింది. పట్టుబడిన మత్స్యకారులంతా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది. 

నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. జూలై 24న శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో రెండు ట్రాలర్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు తొమ్మిది మంది మత్స్యకారులను అరెస్టు చేశారు నేవీ అధికారులు. అంతకు ముందు.. జూలై 8వ తేదీన అదే ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన 15 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేశారు. తరువాత వారిని విడుదల చేయడంతో జూలై 27న చెన్నై చేరుకున్నారు. 

మరోవైపు.. శ్రీలంక నేవీ అధికారుల అదుపులో ఉన్న 19 మంది భారతీయ జాలర్లను తక్షణమే విడుదల చేసి.. ఇండియాకు రప్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం (ఆగస్టు 7వ తేదీన) విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.