ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు స్కెచ్.. 10 మంది అరెస్ట్

ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు స్కెచ్.. 10 మంది అరెస్ట్
  • ధరణిలో బ్లాక్​ లిస్ట్​లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి 
  • ఇద్దరి పేర్లపై పాస్​బుక్​లు జారీచేసిన ఆపరేటర్లు
  • అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు ధరణి ఉద్యోగులు

గచ్చిబౌలి, వెలుగు: కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించిన ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని మణికొండ పోకల్​వాడలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించేందుకు మణికొండకు చెందిన పూస రవీందర్, పూస ప్రహ్లాద్ ​ యత్నిస్తున్నారని గండిపేట తహసీల్దార్​ శ్రీనివాస్​రెడ్డి సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రభుత్వ భూమిని రవీందర్, ప్రహ్లాద్​ పేర్ల మీద రియల్టర్లు రవీందర్​యాదవ్, రాఘవేందర్​రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించారు. భూమి తమ పేరుపై రిజిస్ర్టేషన్​ అయిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాన్​లో నల్లగండ్లకు చెందిన రియల్​ఎస్టేట్​ వ్యాపారులు మోహన్​బాబు, శివరామ్​కుమార్​ చేరారు. అందరూ కలిసి రంగారెడ్డి కలెక్టర్​ ఆఫీసులో ధరణి పోర్టల్​లో పనిచేస్తున్న దీపావత్​ నరేశ్​​, దీపావత్​ శ్రీనివాస్​ను సంప్రదించారు. బ్లాక్​ లిస్ట్​లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పాస్​ బుక్​లు జారీ చేయాలని కోరారు. ఇందు కోసం ధరణి ఆపరేటర్లు రూ.3 కోట్లు డిమాండ్​ చేసి అడ్వాన్స్​గా రూ.8 లక్షలు తీసుకున్నారు.

ఆర్ఐ, ఎమ్మార్వో, ఆర్డీఓ రిపోర్ట్​ లేకుండానే వేర్వేరు సందర్భాల్లో  దీపావత్​ నరేశ్​​..  జిల్లా కలెక్టర్లుగా ఉన్న హరీశ్​​, భారతి హోళికేరీతో ఫైల్స్​పై ఆమోద ముద్రలు వేయించాడు. దీంతో  పూస ప్రహ్లాద్​ పేరుపై 2.20 ఎకరాలు, పూస రవీందర్​ పేరుపై 2.20 ఎకరాలకు పాస్​బుక్​లు జారీ అయ్యాయి. బ్లాక్​ లిస్ట్​లో ఉన్న ప్రభుత్వ భూమికి పాస్​బుక్​లు జారీ కావడం తెలిసి ఎమ్మార్వో సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్స్​ వింగ్​ పోలీసులు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన రియల్టర్లు రవీందర్​యాదవ్, రాఘవేందర్​రెడ్డి, మోహన్​బాబు, శివరామ్​కుమార్, ధరణి ఉద్యోగులు నరేశ్, శ్రీనివాస్, మరో వ్యక్తి భీంరావులను అరెస్ట్​ చేశారు. అప్పటి కలెక్టర్​ హరీశ్​​కు నోటీసులు పంపుతామని సైబరాబాద్  ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​ తెలిపారు. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్​ భారతి హోళికేరి.. తన వద్దకు వచ్చిన అనుమానాస్పద ఫైల్స్​ మొత్తం 68 ఉన్నాయని గుర్తించి పోలీసులకు కంప్లైంట్​ చేశారని పోలీసులు వెల్లడించారు. వాటిపైనా ఎంక్వైరీ చేస్తామన్నారు.