గాంధీలో ర్యాగింగ్.. 10 మంది మెడికోల సస్పెన్షన్

గాంధీలో ర్యాగింగ్.. 10 మంది మెడికోల సస్పెన్షన్
  • గాంధీలో ర్యాగింగ్.. 10 మంది మెడికోల సస్పెన్షన్
  • యూజీసీకి బాధిత విద్యార్థుల ఫిర్యాదు 
  • పైనుంచి ఆదేశాలతో విచారించి, చర్యలు తీసుకున్న కాలేజీ కమిటీ   

పద్మారావునగర్, వెలుగు : గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్​కు పాల్పడిన 10 మంది సీనియర్ స్టూడెంట్లు ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు పది రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. వీరిపై కొద్ది రోజులుగా 2021, 2022 బ్యాచ్ లకు చెందిన 10 మంది సీనియర్ స్టూడెంట్లు రోజూ హాస్టల్ లో ర్యాగింగ్ చేస్తూ వేధించారు. దాంతో వారి టార్చర్ భరించలేక బాధిత స్టూడెంట్లు ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్​కు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి అధికారులు ర్యాగింగ్ గురించి గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డీఎంఈ రమేశ్ రెడ్డికి మెయిల్, ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. 

వెంటనే గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ బాధిత విద్యార్థులతో పాటు ర్యాగింగ్ కు పాల్పడిన స్టూడెంట్లను పిలిపించి సోమవారం విచారణ జరిపింది. ర్యాగింగ్​కు పాల్పడినట్లు విచారణలో తేలడంతో 2021 బ్యాచ్​కు చెందిన ఐదుగురిని, 2022 బ్యాచ్ కు చెందిన ఐదుగురిని ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. పోయిన ఏడాది కూడా జూనియర్లను ర్యాగింగ్ చేసిన15 మంది సీనియర్ స్టూడెంట్లను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎంఈ హెచ్చరించారు.