
ముంబై: వినాయక చవితి వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో 12 మంది మరణించారు. పాల్ఘర్ జిల్లాలోని విరార్ వద్ద బుధవారం (ఆగస్ట్ 27) ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద నుండి ఆరు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరికొందరు చిక్కకోవడంతో వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రెండు బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
పాల్ఘర్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి వివరాల ప్రకారం.. వాసాయి తాలూకా నారంగి రోడ్డులోని చాముండా నగర్, విజయ్ నగర్ మధ్య ఉన్న రమాబాయి అపార్ట్‌మెంట్ నాలుగు అంతస్తుల భవనంలోని కొంత భాగం పక్కనే ఉన్న మరో ఇంటిపై కుప్పకూలిందని తెలిపారు. ఈ ఘటనలో తల్లి-కూతురు జంటతో సహా 12 మంది మరణించారని.. అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారని వెల్లడించారు.
మరికొందరు వేర్వేరు ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బుధవారం (ఆగస్ట్ 27) రాత్రి 11.30 గంటలకు జరిగిందని చెప్పారు. ప్రమాదానికి గురైన భవనం చట్ట విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. స్థానిక అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.