కి‘లేడీ’ కోసం గాలింపు ముమ్మరం.. సీసీటీవీకి చిక్కిన  యశోద దొంగ డాక్టర్

కి‘లేడీ’ కోసం గాలింపు ముమ్మరం.. సీసీటీవీకి చిక్కిన  యశోద దొంగ డాక్టర్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో డాక్టర్ వేషధారణలో వచ్చి రోగి వద్ద 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలి కదలికలను గుర్తించిన మార్కెట్ పోలీసులు.. ఆమెను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. స్టెతస్కోప్, ఏప్రాన్ ధరించి నేరుగా హాస్పిటల్​కు వచ్చిన సదరు మహిళ నర్సింగ్ స్టాఫ్ రూమ్​కు వెళ్లి,  అక్కడ ఇంజెక్షన్లు తీసుకోవడం, పేషెంట్ గదిలోకి ప్రవేశించడం వంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆసుపత్రి సిబ్బంది సహకారం లేకుండా ఈ స్థాయి దోపిడీ సాధ్యం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. లోపల ఉన్న వారెవరైనా సహకరించారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. భారీగా ఫీజులు వసూలు చేసే యాజమాన్యం కనీస భద్రతపై దృష్టి సారించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, త్వరలోనే నిందితురాలిని పట్టుకుంటామని ఇన్​స్పెక్టర్ వి. రాంచందర్ తెలిపారు.