Rain Alert: పొంగి పొర్లుతున్న ఊర చెరువు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్..

Rain Alert:   పొంగి పొర్లుతున్న ఊర చెరువు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్..

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆగస్టు నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి.  దుబ్బాక..  గజ్వేల్​ నియోజకవర్గాల్లో  కురిసిన వర్షాలకు జనజీవనం స్థంభించింది.   ప్రజ్ఞాపూర్ లో కురిసిన   భారీ వర్షాలకు ఊర చెరువు  పొంగిపొర్లి ప్రవహిస్తుంది.  ప్రధాన రహదారి పై వరద నీరు ప్రవహించడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.  మెయిన్​ రోడ్​పై పెట్రోల్​ బంక్​ లో  భారీగా వరద నీరు చేరడంతో.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. 

మర్కుక్ (మం) చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడింది. తోగుట (మం) చందాపూర్ గ్రామంలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. నిన్న ( ఆగస్టు 27)  రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో  కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి.  రెండు రోజులుగా ( ఆగస్టు 28 నాటికి)  కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా నిజాంపేట నుండి నస్కల్ వెళ్లే దారిలో రోడ్డు  కొట్టుకుపోయింది. దీంతో  నస్కల్, నగరం,నందగోకుల్,రాంపూర్ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. 

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చటంతో వర్షాల ప్రభావం మరింతగా పెరిగింది. దీంతో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో గ్రామాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి.  లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు