
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జీఆర్ కాలనీ వంటి ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పెద్ద చెరువు కట్టకు గండి పడింది. దీంతో కట్ట తెగి పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.
Also Read : మెదక్లో జల ప్రళయం.. మర్కుక్ మండలంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి
బుధవారం ( ఆగస్టు 27 ) మధ్యాహ్నం వ్యవసాయ పనులకు వెళ్లిన తొమ్మిది మంది యువకులు యాడారం చెరువులో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు రెస్క్యూ టీమ్స్ రక్షించడంతో సురక్షితంగా బయటపడ్డారు. బీబీపేట పెద్ద చెరువు కట్టకు గండి పడిన క్రమంలో కట్ట తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని...దీని ప్రభావంతో మెదక్ జిల్లా నిజాంపేట మండలపరిధిలోని నందగోకుల్, నస్కల్, రాంపూర్ గ్రామాలకు ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఈ మూడు గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పోలీసులు సూచించారు.