ములుగు జిల్లాకు అలర్ట్.. గోదావరికి పెరుగుతున్న వరద.. ఉదృతంగా వాగులు,వంకలు..

ములుగు జిల్లాకు అలర్ట్.. గోదావరికి పెరుగుతున్న వరద.. ఉదృతంగా వాగులు,వంకలు..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో రహదారులు, రైల్వే ట్రాకులు సైతం దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇప్పటికే మెదక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైన క్రమంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా.. ములుగు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

ఎరురునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద  13.69 మీటర్లకు చేరుకుంది గోదావరి ప్రవాహం. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ( ఆగస్టు 26 ) రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తాడ్వాయి లో 15.78 సెంటీమీటర్లు, లక్ష్మీదేవి పేట లో 12.55 , గోవిందరావు పేట లో 11.73 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది.ప్రాజెక్ట్ నగర్ సమీపంలో వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులను పునరావస కేంద్రానికి తరలించారు అధికారులు. 

ఈ క్రమంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు  జిల్లా ఎస్పీ శబరిష్. వర్షాలు తగ్గేవరకు ప్రజలు పునరావాస కేంద్రాలలో, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు ఎస్పీ.భారీ వర్షాల నేపథ్యంలో  ఎటువంటి విపత్కర పరిస్థితిలు వచ్చిన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ  ఆదేశాలు జారీ. జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన DDRF ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఎస్పీ. తాడ్వాయి మండలంలో జంపన్న వాగు ,ఊరట్ఠం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మేడారంలోని షాపులను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.

పసర, తాడ్వాయి మధ్యలో మండల తోగు దగ్గర రోడ్ పై నుంచి జలవంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో రాకపోకలు నిలిపివేసి.. ట్రాఫిక్ మళ్లించారు అధికారులు. ఇరువైపులా వరద ఉధృతి తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిషేదిస్తున్నట్లు తెలిపారు అధికారులు.