గణేశ్ నిమజ్జనానికి 10 వేల వాహనాలు.. వాహనాల వేటలో మండపాల నిర్వాహకులు..!

గణేశ్ నిమజ్జనానికి 10 వేల వాహనాలు.. వాహనాల వేటలో మండపాల నిర్వాహకులు..!

హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో మండపాల ఏర్పాటు చేసే పక్రియ ముగియడంతో ఇక గణనాథుల నిమజ్జనంపై నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఊరేగింపు కోసం అవసరమైన వాహనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే వాహనాలను బుకింగ్​చేసుకుంటే నిమజ్జనం రోజు టెన్షన్ ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణేశ్​నిమజ్జనానికి అవసరమైన వాహనాలను సమకూర్చేందుకు రవాణాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్​ఆపరేటర్ల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు, డీసీఎంలు, రవాణా ఆటోలను సిద్ధం చేస్తున్నారు. 

వాహనాల కోసం ఇప్పటికే 1,700 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది 8,500 వాహనాలను సమకూర్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వినాయక మండపాలు పెరిగినట్టు స్పష్టం అవుతోంది. గ్రేటర్​ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 11వేల గణపతి మండపాలు నమోదు కాగా, అనధికారికంగా మరో 15వేల వరకు మండపాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. 

దీంతో వాహనాలను సమకూర్చడానికి ఇప్పటికే ఆపరేటర్లతో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ప్రైవేట్​ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయకుండా ఆర్టీఏ అధికారులే ధర నిర్ణయించి వాహనాలను సేకరించనున్నారు. ఇలా సేకరించిన వాహనాలకు నెంబర్లను కేటాయించి రూట్​ల వారీగా  మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈసారి దాదాపు 10 వేల వాహనాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.