దుబాయ్లో మంత్రి కేటీఆర్​... తెలంగాణకు1,040 కోట్ల పెట్టుబడులు

దుబాయ్లో మంత్రి కేటీఆర్​... తెలంగాణకు1,040 కోట్ల పెట్టుబడులు
  •     ముందుకు వచ్చిన నాఫ్కో, డీపీ వరల్డ్, మలబార్, లులూ గ్రూప్​
  •     మంత్రి కేటీఆర్​తో భేటీ అయిన కంపెనీల ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రూ.1,040 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. దుబాయ్​లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్​మంగళవారం ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించారు. యూఏఈకి చెందిన  నాఫ్కో రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడి పెడుతామని తెలిపింది. రాష్ట్రంలోని నేషనల్​అకాడమీ ఆఫ్​ కన్​స్ట్రక్షన్​తో కలిసి ఫైర్​సేఫ్టీ ట్రైనింగ్​అకాడమీ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. కేటీఆర్​తో సమావేశమైన నాఫ్కో సీఈవో ఖాలిద్​ అల్​ ఖతిబ్.. ఇండియాకు సరిపడే స్థాయిలో ఫైర్​సేఫ్టీ ఎక్విప్​మెంట్​ను తాము స్థాపించబోయే సంస్థ ద్వారా తయారు చేస్తామన్నారు.

సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసే ఆక్వా క్లస్టర్​లో లులూ గ్రూప్ పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ సంస్థ చైర్మన్​యూసుఫ్​అలీతో కేటీఆర్​సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఏటా రూ.వెయ్యి కోట్ల ఆక్వా ఉత్పత్తులు సేకరిస్తామని తద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.215 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రముఖ పోర్టు ఆపరేటర్​డీపీ వరల్డ్​తెలిపింది.

ఆ సంస్థ వర్కింగ్​వైస్​ప్రెసిడెంట్​అనిల్ మెహతా దుబయిలో మంత్రి కేటీఆర్​తో సమావేశయ్యారు. హైదరాబాద్​లోని తమ ఇన్​లాండ్​కంటైనర్​డిపో ఆపరేషన్​కోసం రూ.165 కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపారు. మేడ్చల్​సమీపంలో 5 వేల ప్యాలెట్​కెపాసిటీ గల కోల్డ్​స్టోరేజీ వేర్​హౌస్​ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రూ.125 కోట్లతో ఫర్నీచర్​తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మలబార్​గ్రూప్​ముందకు వచ్చింది.