అయోధ్య రాముడికి 10 కిలోల గోల్డ్

అయోధ్య రాముడికి 10 కిలోల గోల్డ్
  •     25 కిలోల వెండి, రూ.25 కోట్లు కూడా..
  •     భారీగా కానుకలు, విరాళాలు ఇచ్చిన భక్తులు 

అయోధ్య: అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. జనవరి 22న గుడి ప్రారంభం కాగా..  నెల రోజుల్లో 60 లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నారని టెంపుల్ ట్రస్టు వెల్లడించింది. ఈ నెల రోజుల్లో భారీగా కానుకలు, విరాళాలు వచ్చాయని తెలిపింది. 10 కిలోల బంగారం, 25 కిలోల వెండితో పాటు నగదు, చెక్కులు, డ్రాఫ్ట్ ల రూపంలో రూ.25 కోట్లను భక్తులు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొంది. 

‘‘ఏప్రిల్ 17న రామనవమి ఉంది. ఈ నేపథ్యంలో మరో 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. ఆ సమయంలో విరాళాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటినీ మెయింటెయిన్ చేసేందుకు ఎస్ బీఐ బ్యాంక్ తో ఒప్పందం చేసుకున్నాం” అని ట్రస్ట్ ఆఫీస్ ఇన్ చార్జ్ ప్రకాశ్ గుప్తా తెలిపారు. ‘‘ఆలయ ఆవరణలో 12 హుండీలు ఏర్పాటు చేశాం. విరాళాలు ఇచ్చే భక్తులకు రసీదులు అందజేసేందుకు 12 కంప్యూటర్ కౌంటర్లు పెట్టాం. 

ఎస్ బీఐ బ్యాంక్ ఆలయ ఆవరణలో నాలుగు కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు విరాళాలు, హుండీల లెక్కింపు జరుగుతోంది” అని చెప్పారు. భక్తులు కానుకగా అందజేసే బంగారం, వెండి, ఇతర ఆభరణాలను కరిగించి భద్రపరుస్తామని.. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ మింట్ కు అప్పగించామని పేర్కొన్నారు. ఇప్పటికే మింట్ సిబ్బంది అయోధ్యకు చేరుకుని పని మొదలుపెట్టారని వెల్లడించారు.