
- కూకట్‌పల్లిలో బాలిక దారుణ హత్య
- మెడ, ఛాతీ, పొట్టపై కత్తి గాట్లు
- ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణం
- తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదన్న పేరెంట్స్
- హత్యకు అంతుచిక్కని కారణాలు
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ కూకట్‌పల్లిలో పదకొండేండ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సోమవారం పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తి పోట్లు కనిపిస్తున్నాయి. బాలికపై అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఎవరో కావాలనే హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు కారకులు ఎవరు, కారణాలు ఏమిటనేది మిస్టరీగా మారింది. హత్య జరిగిన తీరు, సమయం గమనిస్తే తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికులు వెల్లడించిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముత్తా క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కొడుకు, కూతురు సహస్ర(11)తో కలిసి మూడేండ్ల నుంచి కూకట్పల్లి దయార్గూడలో నివ సిస్తున్నారు. కృష్ణ బైక్ మెకానిక్‌గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయలో 6వ తరగతి చదువుతున్నది. ప్రస్తుతం స్కూల్‌కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. సోమవారం ఉదయం భార్యాభర్తలు ఎప్పట్లాగే డ్యూటీలకు వెళ్లారు. సహస్ర ఒంటరిగా ఉన్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కృష్ణ ఇంటికి వచ్చాడు. ఇంటి బయట గడియ పెట్టి ఉంది. తలుపు తీసి చూస్తే సహస్ర రక్తపు మడుగులో పడి కనిపించింది. వెంటనే ఆయన 100కి కాల్ చెయ్యటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
తెలిసినవారి పనే..?
తమకు ఎవరూ శత్రువులు లేరని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కృష్ణ కుటుంబానికి స్థానికంగా ఎవరితోనూ గొడవలు లేవని ఇంటి ఓనర్ కూడా చెప్పారు. దీంతో బాలికను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దయార్‌గూడలోని నాలుగు అంతస్తుల బిల్టింగ్‌లోని నాలుగో అంతస్తులో కృష్ణ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. ఈ బిల్డింగ్‌కి లిఫ్ట్ లేదు. ఎవరైనా నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కి హత్య చేసి ఎవరి కంటా పడకుండా పరారవడంపై అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఇది తెలిసినవారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. హత్య ఒక్కరే చేశారా? ఎక్కువ మంది చేశారా? అన్నదీ తెలియడంలేదని, నిందితులను గుర్తించి పట్టుకోవటానికి నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.