కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు.. 11 మంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు.. 11 మంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

బీజింగ్: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో ట్రాక్ నిర్వహణ కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

గురువారం (నవంబర్ 27) యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో కార్మికులు ట్రాక్ సాధారణ నిర్వహణ పనులు చేస్తుండగా టెస్ట్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. రైల్వే, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారని తెలిపారు. స్టేషన్‌లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా నిర్ధారించలేదని పేర్కొంది. దశాబ్దానికి పైగా చైనాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటని అధికారులు పేర్కొన్నారు.