మిస్డ్ కాల్‌తో హత్య కేసును ఛేదించిన పోలీసులు

మిస్డ్ కాల్‌తో హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఓ చిన్న మిస్డ్ కాల్ సాయంతో పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఇటీవల 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. అదే రోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లి ఫోన్ కు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆమె ఆ నెంబర్ కు కాల్ చేయగా..  ఫోన్  స్విచ్ ఆఫ్ చేసినట్టు వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఫిబ్రవరి 10న పోలీసులను సంప్రదించారు. అది జరిగిన 12 రోజుల తరువాత ఆ బాలిక కిడ్నాప్, హత్య జరిగినట్టుగా గుర్తించిన పోలీసులు.. ఫిబ్రవరి 21న నిందితుడు రోహిత్ అలియాస్ వినోద్‌ ను అరెస్టు చేశారు. 

అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వారి ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. ఫిబ్రవరి 9న ఆమె తల్లికి వచ్చిన మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. దాంతో ఆ నెంబర్ పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 21న నిందితుడిని పట్టుకొని విచారించగా.. బాలికను ఫిబ్రవరి 9న హత్య చేసి ఘోవ్రా మోర్ సమీపంలో పడేసినట్టు వెల్లడైంది. అనంతరం ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.