- మిగతావి వచ్చే నెల10 నాటికి సరఫరా చేస్తాం
- స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం(2026–-27) ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జూన్ 12న స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పుస్తకాలు ఉండేలా చూస్తున్నామని ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం మొత్తం 1,35,70,155 పాఠ్యపుస్తకాలు అవసరమని గుర్తించారు. వీటిలో ఇప్పటివరకు 1,10,26,229 పుస్తకాలను అన్ని జిల్లా కేంద్రాలకు సరఫరా చేశామని, మిగతా పుస్తకాలను వచ్చే నెల 10వ తేదీ నాటికి చేరవేస్తామని స్కూల్ఎడ్యుకేషన్అధికారులు పేర్కొన్నారు.
ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల కోసం విక్రయించే పుస్తకాల ముద్రణ, పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. జూన్ 1వ తేదీ నాటికి ఓపెన్ మార్కెట్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలకు అత్యధికంగా 90 శాతం పుస్తకాలు చేరాయని పేర్కొన్నారు.

