
ఉత్తర భారత్ లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో అయితే మరీను. ఉదయం 8 అవుతున్న ఇంకా చీకటిగానే ఉంది. ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. 50 మీటర్ల దూరంలో కూడా వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు పొగమంచు రవాణా వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ పడింది. ఢిల్లీకి వెళ్లే దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వేశాఖ తెలిపింది. అదేవిధంగా దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. చలికి తోడు ఢిల్లీలో గాలి నాణ్యత కూడా బాగా క్షీణించింది. సగటు గాలి నాణ్యత 381కి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏక్యూఐ441 నమోదు కాగా.. సెంట్రల్ ఢిల్లీలోని లోధి రోడ్‌లో 327గా నమోదైంది. IGI విమానాశ్రయంలో ఏక్యూఐ 368 వద్ద ఉంది. వచ్చే వారంలో గాలి నాణ్యత మరింత తగ్గుతుందని వాతవరణశాఖ అంచనా వేస్తుంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.