ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరానికి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ కు వందల ఏండ్ల చరిత్ర ఉందని, జీవో 111 రద్దు వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. 111 జీవో పరిధిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘన, కాలుష్యకారక అనుమతులు మొదలైన సమగ్ర సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘‘జీవో 111 రద్దు ఎవరి కోసం? జీవో రద్దు.. పర్యవసానాలు’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో పర్యావరణవేత్తలు సుబ్బారావు, దొంతి నరసింహారెడ్డి, శ్రీనివాస్ కొడాలి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం 111 జీవో రద్దుకు ప్రయత్నిస్తోందని సుబ్బారావు విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జీవో రద్దుకు యత్నిస్తోందని దొంతి నరసింహారెడ్డి అన్నారు. 84 గ్రామాల ప్రయోజనం కోసమే అని ప్రభుత్వం చెప్తున్నదని, వారికోసమైతే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించవచ్చని, జీవో రద్దు పరిష్కారం కాదన్నారు. 2019 వరదల నుంచైనా సర్కారు గుణపాఠం నేర్చుకోవాలని శ్రీనివాస్ కొడాలి సూచించారు. జీవో రద్దును వాపస్ తీస్కోవాలని జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు.
