
హైదరాబాద్, వెలుగు: “జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి జులై 1 నుంచి 17 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లు జరుగుతాయి. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి. అఫిలియేషన్ ఉన్న కాలేజీల వివరాలను విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలి..” ఐదు రోజుల కింద అడ్మిషన్ నోటిఫికేషన్ లో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్న సూచన ఇది. కానీ.. ఇప్పటికీ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రాసెస్ మాత్రం పూర్తి కాలేదు. వాస్తవానికి మే31 నాటికే అఫిలియేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని గతంలో ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. కానీ క్లాసులు మొదలైనా అఫిలియేషన్ పంచాయితీ మాత్రం తెగలేదు. మరోవైపు స్టూడెంట్లు మాత్రం అన్ని కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఏటా ఇదే తంతు నడుస్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నవంబర్, డిసెంబర్ వరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చివరకు విద్యార్థుల భవిష్యత్దృష్ట్యా కాలేజీలకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్టు సర్కారు పెద్దలు ప్రకటించడం అలవాటుగా మారిపోయింది.
246 కాలేజీలకే..
ఇంటర్ కాలేజీల్లో ఈ నెల 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్15 నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు మొదలవ్వగా, ఈ నెల 11 నుంచి ఫస్టియర్ క్లాసులూ స్టార్ట్ కానున్నాయి. కానీ ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. అయినా సెకండియర్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఫస్టియర్ అడ్మిషన్ల ప్రాసెస్ కూడా కొనసాగుతోంది. స్టేట్‌వైడ్‌గా1,504 ప్రైవేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఆదివారం నాటికి 246 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఉన్నట్టు అధికారిక వెబ్ సైట్లో ఇంటర్ బోర్డు పేర్కొన్నది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీపేరుతో ఆలస్యం
ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 500కు పైగా మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీలకు మూడేండ్ల నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆయా కాలేజీలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ కాలేజీలకు గుర్తింపు ఉంటుందా లేదా అనే దానిపై అయోయమం నెలకొన్నది. ప్రస్తుతం 1,504 ప్రైవేటు కాలేజీల్లో 246 కాలేజీలకు అఫిలియేషన్ రాగా, మరో 130 అప్లికేషన్లు డీఐఈఓల దగ్గర, 150 వరకూ ఇంటర్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన సుమారు 1000 కాలేజీల పరిస్థితి ఏంటన్నదానిపై ఇంటర్ బోర్డు అధికారుల్లో స్పష్టత కరువైంది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు నడుస్తున్నా.. ఆ కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదన్న విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పేరెంట్స్కూడా అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా ఇంటర్ ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లపై ఇంటర్ బోర్డు, సర్కారు పెద్దలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.