ఒక్క మెషిన్తో 130 రకాల టెస్టులు.. ప్రభుత్వ హాస్పిటల్స్లో హెల్త్ ఏటీఎంలు

ఒక్క మెషిన్తో 130 రకాల టెస్టులు.. ప్రభుత్వ హాస్పిటల్స్లో హెల్త్ ఏటీఎంలు
  • కింగ్ కోఠి, మలక్‌ పేట పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు హెల్త్ డిపార్ట్‌మెంట్ కసరత్తు
  • టీ-డయాగ్నోస్టిక్స్‌ రిపోర్టులతో సరిపోలిన ఏటీఎం ఫలితాలు
  • అభా కార్డుతో లింక్.. నేరుగా ఫోన్‌ కే డిజిటల్ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళ్తే టెస్టుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పని లేదు. రక్తం ఇచ్చి రిపోర్టుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరమూ లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే “హెల్త్ ఏటీఎంలను” అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. 

హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట హాస్పిటల్స్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టిన ఈ మెషీన్లు మంచి ఫలితాలు ఇవ్వడంతో, వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ హెల్త్ ఏటీఎంల పనితీరును పరీక్షించేందుకు అధికారులు ప్రత్యేకంగా ట్రయల్స్ నిర్వహించారు. ఏటీఎం ద్వారా వచ్చిన రిపోర్టులను టీ-డయాగ్నోస్టిక్స్‌తో పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల రిపోర్టులతో క్రాస్ చెక్ చేశారు. రెండు చోట్లా ఫలితాలు ఒకేల రావడంతో  అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే సామాన్యులకు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా, వేగంగా అందే అవకాశం ఉంది.  

  • ఒకే మెషీన్.. 130 రకాల టెస్టులు ..

ఈ క్లౌడ్ ఆధారిత హెల్త్ ఏటీఎం ద్వారా దాదాపు 130కి పైగా టెస్టులు చేయించుకోవచ్చు.  రక్తం తీసుకోకుండా చేసే నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో బీపీ, ఈసీజీ, స్పైరోమెట్రీ, బాడీ మాస్ ఇండెక్స్, బాడీ ఫ్యాట్, ఆక్సిజన్ సాచురేషన్, బాడీ టెంపరేచర్ వంటి 65 టెస్టులు చేసుకోవచ్చు. బ్లడ్ టెస్టుల ద్వారా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్, హెచ్‌బీఏ1సీ వంటి కీలక టెస్టులు ఉన్నాయి.

  గర్భిణీల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ పరీక్షలకు డెర్మాస్కోప్, చెవి పరీక్షలకు ఆటోస్కోప్ వంటి అధునాతన ఫీచర్స్ ఈ ఏటీఎంలోనే అమర్చబడి ఉన్నాయి.  గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ హెల్త్ ఏటీఎంల వాడకంపై అవగాహన ఉండదు. ఈ మెషిన్లను ఆపరేట్ చేసేందుకు, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  • డిజిటల్ రిపోర్ట్.. అభా కార్డుతో లింక్..

 టెస్టులు పూర్తయిన వెంటనే రిపోర్టులు క్లౌడ్ సర్వర్ ద్వారా పేషెంట్ మొబైల్‌కి వాట్సాప్, ఎస్ఎంఎస్ రూపంలో చేరుతాయి. ఈ సిస్టమ్ అభా కార్డు (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)తో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల రోగి హెల్త్ హిస్టరీ మొత్తం డిజిటల్‌గా సేవ్ అవుతుంది. అదే విధంగా ఈ-సంజీవని ద్వారా ఆన్‌లైన్‌లోనే డాక్టర్లను సంప్రదించే వెసులుబాటు కూడా ఉంది. 

పైలట్ ప్రాజెక్ట్‌లో కొన్ని సాంకేతిక సమస్యలను కూడా వైద్యులు గుర్తించారు. ఒక పేషెంట్‌కు అన్ని టెస్టులు చేయాలంటే 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్‌లో బాటిల్‌నెక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హాస్పిటల్స్‌లో రెండు నుంచి మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.