రెండో ప్రపంచ యుద్ధంలో పేలని బాంబు.. జర్మన్ సిటీలో గుర్తింపు

రెండో ప్రపంచ యుద్ధంలో పేలని బాంబు.. జర్మన్ సిటీలో గుర్తింపు

బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధంలో పేలని బాంబు ఒకటి జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ సిటీలో బయటపడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. డస్సెల్​డార్ఫ్ సిటీలోని జూ దగ్గర్లో  సోమవారం రాత్రి పనులు చేస్తుండగా ఈ బాంబు బయటపడింది. అధికారులు దానిని పరిశీలించి బాంబు 5 క్వింటాళ్ల బరువు ఉందని, అది అమెరికా వేసినదని గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని, ఆంక్షలు విధించారు. సుమారు 13 వేల మందిని దగ్గర్లోని స్కూళ్లకు తరలించారు. బస్సులు, ట్రైన్లను నిలిపివేశారు. బాంబును నిర్వీర్యం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు.

భూమిలో వందలాది బాంబులు.. 

1939 నుంచి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై అమెరికా, బ్రిటన్ వేలాది బాంబులు వేశాయి. అందులో పేలని వందలాది బాంబులు కాలక్రమంలో బయటపడుతున్నాయి. ఇంతకుముందు 2020లో ఫ్రాంక్ ఫర్ట్​లో ఓ బాంబు బయటపడడంతో 13 వేల మందిని తరలించారు. 2021 డిసెంబర్ లో మునిచ్​లోనూ ఓ బాంబు బయటపడింది. కన్ స్ట్రక్షన్ సైట్​లో పనులు జరుగుతుండగా  పేలిపోయింది. దీంతో నలుగురు గాయపడ్డారు. 2010 జూన్​లో బయటపడిన ఓ బాంబును అధికారులు నిర్వీర్యం చేస్తుండగా పేలింది. దీంతో ముగ్గురు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. 2006లో అస్కాఫెన్ బర్గ్ లో, 1994లో బెర్లీన్ లోనూ కన్ స్ట్రక్షన్ సైట్లలో రెండు బాంబులు బయటపడ్డాయి.