జీడిమెట్ల, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 23న ఎల్లమ్మబండకు చెందిన లక్ష్మి(63) తన ఇంటికి తాళం వేసి, తాళంచెవిని తలుపు పక్కన ఉన్న డ్రమ్ము కింద దాచిపెట్టి బయటకు వెళ్లింది. ఈ విషయాన్ని అదే కాలనీకి చెందిన పత్రో శంకర్ గమనించాడు. తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న 14 తులాల బంగారు నగలను దొంగలించాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శంకర్‌ను అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
చైన్ స్నాచర్ అరెస్ట్..
అల్వాల్: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురానికి చెందిన సుశీల(55) మంగళవారం రాత్రి వెంకటాపురం నుంచి భూదేవినగర్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా, స్కూటీపై వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగడానికి ప్రయత్నించాడు.
ఆమె ప్రతిఘటించడంతో గొలుసు తెగి సగం ఆమె చేతిలో ఉండగా, మిగతా సగం నిందితుడి చేతికి చిక్కింది. బుధవారం అల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బోయిన్‌పల్లికి చెందిన రెహమాన్(55) అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడే చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి తులంన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
