- పోటీ పడుతున్న 15 మంది నేతలు
- సర్కారొచ్చిన తర్వాత ముగ్గురికే దక్కిన పదవులు
హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు విద్యార్థి నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా తమకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమంతోపాటు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిన్న తమకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది విద్యార్థి నేతలు వివిధ నామినేటెడ్ పోస్టుల కోసం రేసులో ఉన్నారు. ఇందులో పదిమంది వరకు ఓయూకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో, మద్దతు కోసం మంత్రులు, సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారైనా లిస్ట్ లో తమ పేర్లు ఉంటాయా లేదా అని ఎదురుచూస్తున్నారు.
రేసులో కీలక నేతలు..
ఇప్పటికే ఓయూ మాజీ నేతలైన బాలలక్ష్మి, చారుకొండ వెంకటేశ్‌కు నామినేటెడ్ పదవులు లభించాయి. మరో విద్యార్థి నేత కైలాస్‌కు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే, మిగతా 15 మంది నేతలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా చరణ్ కౌశిక్, మానవతారాయ్, లోకేశ్ యాదవ్, చనగాని దయాకర్, దుర్గం భాస్కర్, మహేశ్ కొనగాల, శ్రీహరి నాయక్, దరువు ఎల్లన్న, పిడమర్తి రవి తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఒక సీనియర్ నేత ఎమ్మెల్సీ స్థానం కోరుతుండగా, మరికొందరు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, కమిషన్ మెంబర్ వంటి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాబోయే జాబితాలో కనీసం ఐదుగురు విద్యార్థి నేతలకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
గతంలో మాదిరిగా ప్రయార్టీ ఇవ్వాలి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యమ నేపథ్యం ఉన్న విద్యార్థి నేతలకు నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గౌరవించారని కాంగ్రెస్ విద్యార్థి నేతలు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. తమకు బాధ్యతలు ఇస్తే ప్రభుత్వం, యువత మధ్య వారధులుగా పని చేస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని విద్యార్థి నేతలు హైకమాండ్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు నామినేటెడ్ పోస్టుల జాబితాపైనే నిలిచింది. ఈసారి విద్యార్థి నేతలకు ఎంత మేర అవకాశాలు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది.
