
- ఆసుపత్రికి బాధితుల తరలింపు
- కల్లు అమ్మిన 3 దుకాణాలు సీజ్
కూకట్పల్లి, వెలుగు: కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలోని మూడు కల్లు కాంపౌండ్లలో ఈ ఘటన జరిగింది. కూకట్‌పల్లిలోని ఉషాముళ్లపూరి రోడ్డులో కల్లు కాంపౌండ్, కేపీహెచ్‌బీలోని హైదర్‌నగర్, ఎల్లమ్మబండ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్ లో మంగళవారం సాయంత్రం కొంతమంది కల్లు తాగారు. కాసేపటికి వారంతా అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతోపాటు బాధితులకు విరేచనాలు కూడా అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు వారిని కూకట్‌పల్లిలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో కోటేశ్వరరావు అనే వ్యక్తికి సీరియస్‌గా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్స్ కు తరలించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.. రాందేవ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కల్లు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కల్తీ కల్లు కారణంగానే వారు అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. బాధితులందరూ క్రమంగా కోలుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. మూడు కల్లు కాంపౌండ్లను రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.