150 దేశాలు మన వ్యాక్సిన్ కావాలని అడుగుతున్నాయి

150 దేశాలు మన వ్యాక్సిన్ కావాలని అడుగుతున్నాయి
  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రపంచంలోని 150 దేశాలు మన దేశంలో తయారైన వ్యాక్సిన్ వావాలని అడుగుతున్నాయని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు, వినతులు పంపాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం గుడిమల్కాపూర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు వ్యాక్సిన్ అందుతున్నతీరు, వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ఉన్న సదుపాయాలను పరిశీలిచి సందర్శకులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కంట్రోల్ చేయడానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. డిసెంబర్ నెల కల్లా మెజారిటీ ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. 
ఆధార్ లేనివారికి, విదేశీయులకు కూడా వ్యాక్సిన్
ఆధార్ కార్డ్ లేని వారికి, ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చిన వారికి సైతం మానవతా దృక్పథంతో వ్యాక్సినేషన్ చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద మన వద్ద ఉన్న వ్యాక్సిన్ నాణ్యత మరెక్కడా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 150 దేశాలు మన వద్ద ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే మొదటి ప్రాధాన్యత గా మన దేశ ప్రజలకే ఇస్తున్నామన్నారు. మన దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిన తరువాతే ఇతర దేశలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.