వెలుగులోకి మోడీ లిపిలోని ప్రాచీన దస్తావేజులు

వెలుగులోకి మోడీ లిపిలోని ప్రాచీన దస్తావేజులు

నిర్మల్, వెలుగు: నిర్మల్  జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మోడీ లిపిలో రాసిన దస్తావేజులు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్  తుమ్మల దేవరావు తెలిపారు. దేవగిరిని పాలించిన యాదవ రాజులు మహాదేవ, రామచంద్రుల కాలంలో, 13వ శతాబ్దంలో మంత్రిగా పని చేసిన హేమాడ్ పంత్ (హేమాద్రి పండితుడు) దర్బారుల్లో రహస్య భాషగా ఉపయోగించడానికి మోడీ లిపిని అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఈ లిపిని తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో రాజుల ఆజ్ఞలు, గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, శాసనాలు, భూపత్రాలు, వంశవృక్షాలు నమోదు చేయడానికి ఉపయోగించేవారని చెప్పారు. 150 ఏండ్ల నాటి మోడీ లిపిలో రాసిన ఒక ఫర్మానాను తాను సేకరించినట్లు పేర్కొన్నారు. నిర్మల్  జిల్లాలో 1950 వరకు వ్యాపారస్తులు, కర్ణాలు తమ దస్తావేజులను మోడీ లిపిలోనే రాసేవారని గుర్తు చేశారు.

మరాఠి భాష, దేవనాగరి లిపి ఆధారంగా ఈ లిపి రూపుదిద్దుకుందని తెలిపారు. శివాజీ మహారాజ్  కాలంలో మోడీ లిపి ప్రాచుర్యం పొందిందని, ఆయన వద్ద పని చేసిన బాలాజీ అవచి చిట్నీస్  ఈ లిపిని సంస్కరించి దర్బారు ఆదేశాలను వేగంగా చేరవేయడానికి వినియోగించారని చెప్పారు. ‘మోడణే’ పదం నుంచి మోడీ అనే పేరు వచ్చిందని, వంచడం లేదా మడవడం అని దీని అర్థమని తెలిపారు. ఈ లిపిలో పెన్నును ఎత్తకుండా వేగంగా రాయగలిగే విధానం ప్రత్యేకత అని వివరించారు. దీనిని గొలుసు రాతగా కూడ పేర్కొంటారు. నిర్మల్  జిల్లాలోని అనేక గ్రామాల్లో ఒకప్పుడు మోడీ లిపి చదవగలిగిన వారు ఉండేవారని, ప్రస్తుతం ఈ లిపి కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ లిపికి చెందిన శిలాశాసనాలు, దస్తావేజులు సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.