మావోయిస్టు కీలక నేత ఆశన్న లొంగుబాటు..పోలీసుల ఎదుట సరెండర్

మావోయిస్టు కీలక నేత ఆశన్న లొంగుబాటు..పోలీసుల ఎదుట సరెండర్
  • ఇవాళ చత్తీస్​గఢ్​ సీఎంకు ఆయుధాల అప్పగింత
  • రెండు రోజుల్లో 258 మంది లొంగిపోయారంటూ అమిత్​ షా ట్వీట్​
  • 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటన

కరీంనగర్/ భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన మరుసటి రోజే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 170 మంది మావోయిస్టులు గురువారం చత్తీస్ గఢ్  పోలీసుల ఎదుట సరెండర్​ అయ్యారు. 

వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్​ ఆశన్న అలియాస్ ​రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత  ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు.  బుధవారం చత్తీస్ గఢ్ లో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలో కలిశారని, రెండు రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారని ఆయన ప్రకటించారు. నక్సలిజంపై పోరులో ఇదో మైలురాయి అని ట్వీట్​ చేశారు. అబుజ్‌‌‌‌మడ్, ఉత్తర బస్తర్‌‌‌‌ ఇప్పుడు నక్సల్స్​ నుంచి విముక్తి పొందాయని పేర్కొన్నారు. 

నేడు చత్తీస్​గఢ్​ సీఎంకు ఆయుధాల అప్పగింత

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసు దేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 121 ఏరియా కమిటీ సభ్యులు/జన మిలీషియా సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు బైరాం గఢ్ వైపు వచ్చారు. 

భైరామ్ గఢ్ నుంచి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఇంద్రావతి నదిని దాటి జగదల్ పూర్ కు చేరుకోనున్నాయి. వీరంతా జగదల్ పూర్ లో చత్తీస్ గఢ్ విష్ణుదేవ్ సాయ్, రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట శుక్రవారం ఆయుధాలు అప్పగించి లొంగుబాటును కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనున్నారు. 

ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా,  దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు రాజ్‌‌‌‌మాన్ మాండవి, రాజు సలాం నేతృత్వంలో 32 మంది మహిళా మావోయిస్టులు సహా 50 మంది మావోయిస్టులు చత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్‌‌‌‌లోని కోయలైబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ 40వ బెటాలియన్‌‌‌‌శిబిరంలో లొంగిపోయారు. 

22 నెలల్లో 2100 మంది లొంగుబాటు.. 

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 1785 మంది అరెస్ట్​ అయ్యారని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. వివిధ ఎన్ కౌంటర్లలో 477 మంది మావోయిస్టులు చనిపోయారని ట్వీట్​ చేశారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం.తుపాకీని పట్టుకునేవారు మా దళాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు. 

నక్సలిజం మార్గంలో ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేం కట్టుబడి ఉన్నం” అని ఆయన పేర్కొన్నారు.