హైదరాబాద్ సిటీ, వెలుగు: కొండాపూర్ ప్రభుత్వ దవాఖాన సమీపంలోని ఓయో హైలెట్స్ హోటల్‌లోని రూముల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని అసోం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. 17.1 కిలోల మాల్స్వాధీనం చేసుకున్నారు. విలువ రూ. 9 లక్షలు ఉంటుందని ప్రకటించారు.
కేసులో అసోంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25)ను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ గతంలో సిటీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. జీతం సరిపోక ఓయో హోటల్‌లోని రూములను కేంద్రంగా చేసుకుని గంజాయి దందాలోకి దిగారు.
