3 నెలలు.. రూ.32 వేల కోట్లు

3 నెలలు.. రూ.32 వేల కోట్లు
  • మోసపోయిన 18 ప్రభుత్వ బ్యాంకులు
  • 2,480 కేసులు నమోదు.. ఆర్టీఐతో వెల్లడి

న్యూఢిల్లీ: 31,898.63 కోట్ల రూపాయలు.. ఇదీ 3 నెలల్లో 18 ప్రభుత్వ బ్యాంకులకు కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టిన మొత్తం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో బ్యాంకు మోసాలపై 2,480 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్​కు చెందిన చంద్రశేఖర్​ గౌర్​ అనే స్వచ్ఛంద కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు చేసుకోవడంతో ఆర్బీఐ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్​బీఐలోనే ఎక్కువ మోసాలు జరిగినట్టు ఆర్టీఐ దరఖాస్తులో తేలింది. 38 శాతం వాటా ఆ బ్యాంకుదే. 1,197 ఫ్రాడ్​ కేసులు నమోదు కాగా, రూ.12,012.77 కోట్ల మోసం జరిగింది.

ఎస్​బీఐ తర్వాత అలహాబాద్​ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. 381 కేసులతో 2,855.46 కోట్ల మోసం జరిగింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంకులో 99 మోసం కేసులు నమోదయ్యాయి. రూ.2,526.55 కోట్ల ఫ్రాడ్​ జరిగింది. బ్యాంక్​ ఆఫ్​ బరోడాకు సంబంధించి 75 కేసులు బుక్కవగా, రూ.2,297.05 కోట్ల ఫ్రాడ్​ జరిగింది. ఓరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​లో 45 కేసులు, రూ.2,133.08 కోట్లు, కెనరా బ్యాంకు 69 కేసుల్లో 2,035.81 కోట్లు, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 194 కేసుల్లో రూ.1,982.27 కోట్లు, యునైటెడ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 31 కేసుల్లో రూ.1,196.19 కోట్ల మోసం జరిగింది. కార్పొరేషన్​ బ్యాంకుకు సంబంధించి 16 మోసం కేసులు నమోదైతే, రూ.960.8 కోట్ల ఫ్రాడ్​ జరిగింది.

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంకులో 934.67 కోట్ల రూపాయల మోసం జరిగింది. 46 కేసులు బుక్కయ్యాయి. సిండికేట్​ బ్యాంక్​ 54 కేసుల్లో రూ.795.75 కోట్లు, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ 51 కేసుల్లో రూ.753.37 కోట్లు, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 42 కేసుల్లో రూ.517 కోట్లు, యుకో బ్యాంక్​ 34 కేసుల్లో రూ.470.74 కోట్లు మోసపోయాయి. బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్​, ఇండియన్​ బ్యాంక్​, పంజాబ్​అండ్​ సింధ్​ బ్యాంకులూ మోసపోయిన జాబితాలో ఉన్నాయి. అయితే, ఆ మోసాలకు సంబంధించిన తీరును మాత్రం ఆర్​బీఐ వెల్లడించలేదు. అన్ని కోట్ల రూపాయల మోసం జరిగిందని చెప్పిందే తప్ప, ఆ మోసాల వల్ల బ్యాంకులు ఎంత నష్టపోయాయన్నదీ చెప్పలేదు. ప్రస్తుతం వాటిపైనే రివ్యూ చేస్తున్నామని చెప్పింది.