- కోతలు, సరఫరా లోపాలు తగ్గించేందుకు ఏఐ వాడండి: సీఎం రేవంత్
- భారీ డేటా సెంటర్లకు వెంటనే పర్మిషన్ ఇవ్వండి
- రైతు డిస్కంపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించాలని అధికారులకు ఆదేశం
- విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రివ్యూ
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో సబ్ స్టేషన్ల పక్కనే సోలార్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున మొత్తం 18 సోలార్ ప్లాంట్లను సబ్ స్టేషన్ల పక్కనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వీటి పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి, భారీ డేటా సెంటర్లకు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఎంసీహెచ్‌ఆర్డీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా, సరఫరా లోపాలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
- పక్కా ప్లానింగ్ ఉండాలి..
ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకుండా పక్కా ప్లానింగ్ ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్‌లాంటి భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో పెరగబోయే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం) ఏర్పాటుపై ఉద్యోగులు, సిబ్బందిలో ఉన్న అపోహలను వెంటనే తొలగించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్‌పై, సోలార్ స్టవ్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
